కలం, మహబూబ్నగర్ బ్యూరో: కనీస వేతన జీవోలను విడుదల చేశామని రాష్ట్ర ప్రభుత్వం సంబరపడుతున్నా అమలు మరిచారని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పరిశుద్ధ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులకు (Hospital Workers Protest) కనీస వేతనాలు రూ.26 వేలకు పెంచాలని కాల పరిమితి ముగిసిన ఏజెన్సీలను రద్దు చేయాలని కార్పొరేషన్ ద్వారా నేరుగా ప్రభుత్వం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కార్మికులకు పనిభారం తగ్గించాలని తదితర డిమాండ్ల సాధనకై గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆసుపత్రి కార్మికుల నిరవధిక ఆందోళనలో భాగంగా తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికులు ఆసుపత్రిలో ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టి, మహిళా కార్మికులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్టు కార్మికులు (Hospital Workers Protest) దశాబ్దాల తరబడి కనీస వేతనాలకు నోచుకోకుండా వెట్టి చాకిరికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కష్టం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్లే లోపు ఇష్టమైన ఏజెన్సీల విధానంతో కార్మికులు శ్రమ దోపిడికి గురి కావడమే కాకుండా ఆర్థికంగా చితికి పోతున్నారన్నారు. 11,500 జీతంతో కార్మికుల కుటుంబాలు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. చట్టబద్ధంగా కార్మికులకు రావాల్సిన వేతనాలు పీఎఫ్ ఈఎస్ఐలు సక్రమంగా అందడం లేదని వీటిని పర్యవేక్షించాల్సిన లేబర్ శాఖ కాంట్రాక్టర్ల కాసులకు కక్కుర్తి పడి చేతులెత్తేసిందని మండిపడ్డారు. ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులకు సపర్యాలు చేస్తున్న ప్రభుత్వ వైఖరి కారణంగా కార్మికుల సగటు ఆదాయం మాత్రం పెరగటం లేదని అన్నారు.
ధరలు దగ్గుమంటున్నాయని పెరుగుతున్న ధరలతో కార్మికుల జీవనం విధ్వంసం అవుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే కాంట్రాక్టు కార్మికులతో చర్చలు జరిపి కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనిచో పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి బ్రాంచ్ యూనియన్ నేతలు కార్మికులు చెన్నయ్య, నరసింహ, రాఘవేందర్, బుచ్చన్న, బాలరాజ్, అంజి, యాదయ్య, శ్రీనివాస్ రెడ్డి, మన్యం, యాదగిరి, శ్రీను, నరేష్, అంజయ్య, శ్రీశైలం శంకర్, వెంకటన్న, గంగాధర్, కృష్ణ, శ్రీనివాస్,నరసింహ, పద్మమ్మ వసంత సత్తెమ్మ, నాగమ్మ, లక్ష్మమ్మ, చంద్రకళ, దేవి, జ్యోతి, వరలక్ష్మి, సునీత, మంజుల, జమున, అరుణ, కవిత, మీనా సంధ్య లక్ష్మి, జ్యోతి, నిర్మల, మమత, చెంచు లక్ష్మమ్మ, తిరుపతమ్మ, చిట్టెమ్మ, మల్లమ్మ, సంజన, వెంకటమ్మ, సునీత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

