కలం, మహబూబ్ నగర్ బ్యూరో: బాలల దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పాలమూరు లయన్స్ క్లబ్ (Palamuru Lions Club) ఆధ్వర్యంలో అంధుల ఆశ్రమ విద్యార్థులకు ఉచితంగా దుప్పట్లు పంపిణీ చేశారు. మహబూబ్ నగర్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రంగం కురుమూర్తి కుమార్తె విద్యాభిమానురాలు రంగం చరిత సహకారంతో ఆదివారం మహబూబ్ నగర్‌లోని అంధుల ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన లయన్స్ ఇంటర్నేషనల్ 320ఎ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ డాక్టర్ అంబటి నటరాజ్, పాలమూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ సి.బాబుల్ రెడ్డి, పీఆర్ఓ లయన్ అశ్విని చంద్రశేఖర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా లయన్స్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అంబటి నటరాజ్ మాట్లాడుతూ.. అంధుల ఆశ్రమ విద్యార్థుల సంక్షేమానికి అన్ని విధాల సహకారం అందిస్తామని అన్నారు. చలి తీవ్రతను తట్టుకునేందుకు గాను విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్‌లోని ఒక ప్రైవేట్ ఫార్మసీ కళాశాలలో అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న రంగం చరిత తన వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు చేయూత నివ్వడం అభినందనీయం అని కొనియాడారు.
పాలమూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ సి. బాబుల్ రెడ్డి మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పేదల అభ్యున్నతికి తమ వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.
పాలమూరు లయన్స్ పీఆర్ఓ లయన్ అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఉన్నతికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. విద్యార్థులు చలి తీవ్రతను తట్టుకునేందుకు వీలుగా ఉదార స్వభావంతో దుప్పట్లు అందించిన రంగం చరితకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంధుల ఆశ్రమ పాఠశాల వార్డెన్ పి.ఆంజనేయులు, ఉపాధ్యాయులు టి.వెంకటేష్, మధుసూదన్ గౌడ్ విద్యార్థులు పాల్గొన్నారు.

