వృద్ధులు, దివ్యాంగులకు మంత్రి పొన్నం ప్రత్యేక భరోసా

కలం, కరీంనగర్ : హుస్నాబాద్ (Husnabad) నియోజకవర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉచితంగా సహాయ ఉపకరణాలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు.. రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. నవంబర్ 16 నుంచి 27వ తేదీ వరకు నియోజకవర్గంలోని 7 మండలాలు, ఒక మున్సిపాలిటీలో ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఒక మనిషి నడవడానికి మరొకరి సాయం కోసం ఎదురుచూడకూడదని, వినడానికి, చూడడానికి, తన పనులు తాను చేసుకోవడానికి ఎవరిపైనా ఆధారపడకుండా ప్రతి దివ్యాంగుడు ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో జీవించాలన్నదే తమ ఆశయమని మంత్రి పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క దివ్యాంగుడు, వృద్ధుడు కూడా సహాయం అందక ఇబ్బంది పడకూడదని, ఏ ఒక్క అర్హుడికీ ప్రభుత్వ సహాయం అందకుండా పోకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని దివ్యాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో అమలవుతున్న ADIP పథకం కింద ALIMCO (Artificial Limbs Manufacturing Corporation of India) సంస్థ సహకారంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాల ద్వారా అర్హులైన దివ్యాంగులు, వయోవృద్ధులకు మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వీల్‌చైర్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు, వాకింగ్ స్టిక్స్, కళ్లద్దాలు, నడక సహాయక పరికరాలు తదితర ఉపకరణాలను ఉచితంగా అందించనున్నారు. అదేవిధంగా 80 శాతానికి పైగా వైకల్యం ఉన్న అర్హులైన దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

శిబిరాల తేదీలు, సమయాలు, ప్రదేశాలు :
  1. సైదాపూర్ మండలం: నవంబర్ 16, సోమవారం – ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణం.
  2. ఎల్కతుర్తి మండలం: నవంబర్ 17, మంగళవారం – ఎస్.ఎం.ఆర్. ఫంక్షన్ హాల్, వరంగల్ రోడ్డు.
  3. అక్కన్నపేట మండలం: నవంబర్ 18, బుధవారం – రైతు బజార్ / హైస్కూల్ (వేదిక ఖరారు కావాల్సి ఉంది).
  4. కోహెడ మండలం: నవంబర్ 20, శుక్రవారం – లక్ష్మీ గార్డెన్.
  5. చిగురుమామిడి మండలం: నవంబర్ 21, శనివారం – మహాలక్ష్మి ఫంక్షన్ హాల్, చిన్న ముల్కనూరు.
  6. హుస్నాబాద్ రూరల్: నవంబర్ 25, బుధవారం – మున్సిపాలిటీ.
  7. హుస్నాబాద్ టౌన్: నవంబర్ 26, గురువారం – మున్సిపాలిటీ.
  8. భీమదేవరపల్లి మండలం: నవంబర్ 27, శుక్రవారం – ప్రభుత్వ ఉన్నత పాఠశాల.

అన్ని శిబిరాలు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు.

అర్హులకు సమాచారం చేరవేయాలి

హుస్నాబాద్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, AMC చైర్మన్లు, PACS చైర్మన్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ తమ మండలాలు, గ్రామాల పరిధిలోని అర్హులైన దివ్యాంగులు, వృద్ధులను గుర్తించి ఈ శిబిరాల సమాచారాన్ని వారికి చేరవేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సంబంధిత మండలంలో నిర్ణయించిన తేదీన ఉదయం 10 గంటలకు నిర్వహించే శిబిరాలకు హాజరయ్యేలా చొరవ తీసుకోవాలని, వారికి అవసరమైన సహకారం అందించాలని కోరారు.  ప్రతి గ్రామంలోని అర్హులైన వారందరికీ ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>