కలం, నిర్మల్ : ఓవైపు రాష్ట్రంలో రైతులు కరువు, సాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు భారత్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ మద్యం, పాటల కచేరీలతో సంబరాలు నిర్వహించడం ఏమిటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ (Ritesh Rathod) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రజాధనంతో ఆర్భాటపు వేడుకలు నిర్వహించడం సిగ్గుచేటని విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ వల్ల తెలంగాణ ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పంట నష్టాలు, సాగునీటి ఇబ్బందులతో సతమతమవుతుంటే వారి సమస్యలను పట్టించుకోకుండా విలాసవంతమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ప్రజాధనం వినియోగంలో పారదర్శకత పాటించాలని, ఖర్చు చేసిన ప్రతి రూపాయికి ప్రభుత్వం ప్రజలకు లెక్క చెప్పాలని రితేష్ రాథోడ్ డిమాండ్ చేశారు.

