కలం, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు (Tiruvuru) లో ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన 22 ఏళ్ల యువతి, శస్త్రచికిత్స అనంతరం మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే.. నూతిపాడు గ్రామానికి చెందిన మన్నెం నాగలక్ష్మి (22) ప్రసవం కోసం తిరువూరులోని ఓ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ నిర్వహించగా, ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అయితే, శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత నాగలక్ష్మి శరీరంలో ప్లేట్ లెట్స్ గణనీయంగా పడిపోయాయని, మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్య సిబ్బంది సూచించారు.
ఈ క్రమంలో నాగలక్ష్మి పరిస్థితి విషమించి మృతిచెందింది. వైద్యులు కనీసం మెడికల్ రిపోర్టులు కూడా ఇవ్వకుండా, తమను ఆసుపత్రి నుంచి పంపించేందుకు ప్రయత్నించారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నాగలక్ష్మి ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బంధువులు, గ్రామస్తులు ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు.

