కలం, వెబ్ డెస్క్: ఏపీలో ‘మురసు’ తీవ్ర తుఫాన్ విధ్వంసంపై ఆర్థిక నష్టం అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి అమరావతికి ముఖ్యమంత్రి రానున్నారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో కేంద్ర బృందం సమావేశమయ్యే అవకాశం కనిపిస్తోంది.
రాష్ట్రంలో విధ్వంసం సృస్టించిన ‘మురసు’ తుఫాన్ ఎఫెక్ట్ తో జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల బృందం ప్రభావిత జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం రెండు విభాగాలుగా పర్యటిస్తోంది.
శుక్రవారం బాపట్ల, ఏలూరు జిల్లాల్లో పర్యటించిన కేంద్ర బృందం.. శనివారం పల్నాడు, తూర్పుగోదావరి జిల్లాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశిలించింది. ఒంగోలు సమీపంలో నవంబర్ 3న మురసు తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని 7 జిల్లాల్లోని 106 మండలాలు, 315 గ్రామాల్లో దాదాపు 1.94 లక్షల మంది ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తుఫాన్ వల్ల మొత్తం రూ. 2,484.43 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది.

