కలం, వెబ్ డెస్క్ : విజయనగరం జిల్లాలో జరిగిన వైసీపీ సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. అలాగే తమ వాళ్లను కష్టపెట్టే వారికి, వ్యతిరేకంగా వ్యవహరించే వారికి రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని, గతంలో మాదిరిగా ‘అయ్యో పాపం’ అంటూ కనికరం చూపించి వదిలేసే పరిస్థితులు ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండవని తేల్చిచెప్పారు.
రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే పార్టీ శ్రేణులు తమ మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉందని బొత్స అభిప్రాయపడ్డారు. అందరినీ సమానంగా చూసే ‘ఈక్వాలిటీ రాజకీయాలు’ ఇకపై పనిచేయవేమో అనిపిస్తోందని వ్యాఖ్యానించిన ఆయన.. కక్షపూరిత రాజకీయాలు చేసే వారికి చుక్కలు చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే విషయాన్ని, తన అభిప్రాయాలను పార్టీ అధినేత వైఎస్ జగన్ కి కూడా నేరుగా వివరించినట్లు బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
ఇటీవల విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, బొత్స మేనల్లుడు చిన్న శ్రీనుతో పాటు మరికొందరు బంధువులు టీడీపీలో చేరిన పరిణామాల నేపథ్యంలో జిల్లా కేడర్ డీలా పడింది. దీంతో జిల్లాలో పార్టీ కేడర్ తిరిగి ఆత్మస్థైర్యం నింపేందుకు బొత్స ఈ తరహా ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

