కలం, మధిర: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో (Indiramma Family Life Insurance), మధిర (Madhira) పట్టణంలోని ప్రతి కుటుంబం తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ సామినేని సుజాత పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ పథకం నమోదు ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నారని తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పిస్తూ ఈ విధానాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించబోతోందని పేర్కొన్నారు.
కుటుంబానికి ఆధారమైన వ్యక్తి అకాల మరణం చెందితే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోకూడదనే సదుద్దేశంతో ప్రజా ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని కొనియాడారు. ఈ నెల 17, 18 తేదీల్లో మధిర పట్టణంలోని ప్రతి వార్డులో వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వార్డుల్లో టమకాలు వేయించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రతి కుటుంబాన్ని ఈ జీవిత బీమా పథకంలో చేర్చేందుకు బాధ్యత తీసుకోవాలని కోరారు. మధిర పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించుకోవాలని సామినేని సుజాత శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

