కలం, స్పోర్ట్స్: యూత్ ఒలింపిక్స్‌లో (Youth Olympics) భారత యువ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు. చివరి రోజు బాక్సింగ్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించి పోటీలను ఘనంగా ముగించారు. ఈ పోటీల్లో భారత్ మొత్తం 10 పతకాలు గెలుచుకుంది. వీటిలో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఐదు కాంస్యాలు ఉన్నాయి. పురుషుల 50 కేజీల బాక్సింగ్ ఫైనల్లో లైరెన్‌లక్ఫామ్ అంబేకర్ మీటీ 3-2తో ఐర్లాండ్‌కు చెందిన క్రిస్టియన్ జుబానీని ఓడించి స్వర్ణం సాధించారు. దీంతో యూత్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత బాక్సర్‌గా నిలిచారు.
మహిళల 48 కేజీల ఫైనల్లో గుంజన్ 5-0తో అల్జీరియాకు చెందిన బౌతైనా బెన్సాలాపై విజయం సాధించి మరో స్వర్ణాన్ని అందించారు. యూత్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్ స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించారు. బాక్సింగ్‌తో పాటు ఇతర క్రీడల్లోనూ భారత అథ్లెట్లు పతకాలు సాధించారు. జూడోలో ఖుష్బు రాజ్‌భాయ్ దర్జాడ, బ్యాడ్మింటన్‌లో తన్వీ పత్రి, బీచ్ రెజ్లింగ్‌లో తానియా రజతాలు గెలుచుకున్నారు.
స్విమ్మింగ్‌లో ధినిధి దేశింగు 100 మీటర్లు, 200 మీటర్ల ఫ్రీస్టైల్ విభాగాల్లో రెండు కాంస్యాలు సాధించారు. తిర్థాంక్ పెగు 200 మీటర్ల బటర్‌ఫ్లైలో కాంస్యం గెలిచారు. అథ్లెటిక్స్‌లో శౌర్య అంబురే 100 మీటర్ల హర్డిల్స్‌లో, వుషులో రాజ్‌కుమారి లాంచెన్‌బి చాను చాంగ్‌క్వాన్ విభాగంలో కాంస్య పతకాలు సాధించారు.
ఈసారి భారత్ సాధించిన 10 పతకాలు యూత్ ఒలింపిక్స్ చరిత్రలో దేశానికి రెండో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచాయి. 2018లో బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన పోటీల్లో భారత్ 13 పతకాలు సాధించింది. ఈసారి 17 మంది అథ్లెట్లతో బరిలోకి దిగిన భారత్.. ఏడు క్రీడాంశాల్లో పతకాలు గెలుచుకుంది. మొత్తం 17 మందిలో తొమ్మిది మంది పతకాలతో తిరిగొచ్చారు.

