కలం, కరీంనగర్ బ్యూరో : NHM ఉద్యోగ నియామకలో జరిగిన అక్రమలపై విచారణ జరిపించాలని కోరుతూ అదనపు కలెక్టర్ కి ఏఐవైఎఫ్ (Karimnagar AIYF ) ఆధ్వర్యంలో శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా కార్యాలయం పరిధిలో NHMఉద్యోగ నియామకాల్లో Recruitment విభాగం సిబ్బంది ద్వారా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్న అవకతవకలు, మార్కుల మెమోల మార్పులు, డబ్బులు తీసుకొని మెరిట్ జాబితాలో పేర్లు చేర్చడంపై ACB ద్వారా సమగ్ర విచారణ జరిపించి, విచారణ పూర్తయ్యే వరకు నియామకాలను నిలిపివేయలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా DM&HO కార్యాలయంలోని Recruitment విభాగానికి సంబంధించిన కొంతమంది సిబ్బంది అభ్యర్థుల విద్యార్హత మార్కుల మెమోలలో మార్పులు చేసి, వాస్తవ మార్కుల కంటే అధికంగా 92%, 93% మార్కులు వచ్చినట్లుగా చూపిస్తూ మెరిట్ జాబితాలో స్థానం కల్పించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, కొంతమంది అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకొని, వారి మార్కుల మెమోలను మార్చడం లేదా నకిలీ మెమోలు తయారుచేయించడం ద్వారా అధిక మెరిట్ వచ్చినట్లుగా చూపించి ఉద్యోగ నియామకాల్లో అక్రమ ప్రయోజనం కల్పించారనే తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి.
ఈ వ్యవహారంలో Recruitment విభాగం సిబ్బంది పాత్రతో పాటు, సంబంధిత అభ్యర్థుల సర్టిఫికెట్ల నిజానిజాలను కూడా నిష్పక్షపాతంగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. DM&HO కార్యాలయంలోని Recruitment విభాగం సిబ్బంది పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని, మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థుల ఒరిజినల్ మార్కుల మెమోలను సంబంధిత యూనివర్సిటీలు, విద్యాసంస్థలు మరియు బోర్డుల ద్వారా నేరుగా ధృవీకరించాలని చెప్పారు. 92%, 93% మార్కులు పొందినట్లు చూపిస్తున్న అనుమానాస్పద మెమోలపై ప్రత్యేక విచారణ జరిపించి దోషులను శిక్షించాలని.. నకిలీ మెమోలు తయారుచేసినవారు, మార్కులు మార్చినవారు , వాటికి సహకరించిన సిబ్బంది పాత్రను గుర్తించి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నట్లు ఉన్న ఆరోపణలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) ద్వారా స్వతంత్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
అవసరమైన రికార్డులు, దరఖాస్తులు, మెరిట్ జాబితాలు, సర్టిఫికెట్ల పరిశీలన వివరాలు, సంబంధిత డిజిటల్ రికార్డులను భద్రపరచాలని కోరారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత పోస్టుల నియామక ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలన్నారు. విచారణలో అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులైన సిబ్బంది మరియు సంబంధిత అభ్యర్థులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని యుగంధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ చంచల మురళి, కాల్వ శ్రీనివాస్, పెనుమళ్ల ఉదయభాస్కర్, నగర సహాయ కార్యదర్శి జువ్వాజి తిరుపతి, వినయ్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

