10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి: మంత్రి కోమటిరెడ్డి

కలం, నల్లగొండ: రానున్న 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy) ఆదేశించారు. శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి కలెక్టర్ బి.చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

జిల్లా వ్యాప్తంగా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా, ఏకంగా 7 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం, 2.35 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. ప్రతిపాదించిన 307 కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటికే 100 కేంద్రాలను ప్రారంభించామని, 65 కేంద్రాల్లో 55,174 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని తెలిపారు.

మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నల్గొండ, నకిరేకల్ నియోజకవర్గాల్లో ధాన్యం ముందుగానే మార్కెట్‌కు వస్తోందన్నారు. నల్గొండ పట్టణంలోని మామిళ్లగూడెం సమీపంలో 6 ఎకరాల విస్తీర్ణంలో 12 ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో టవర్‌లో 40 ఇళ్ల చొప్పున మొత్తం 480 ఇళ్లను ఏడాదిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నల్గొండ పట్టణంలో ఏటా 50 చొప్పున మొత్తం రెండు వేల ఇళ్లను నిరుపేదలకు అందిస్తామని భరోసా ఇచ్చారు.

డంపింగ్ యార్డ్ తరలింపు..

చారిత్రక ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి, పానగల్ ఉదయ సముద్రం చెరువు కట్ట సుందరీకరణ, పార్కు నిర్మాణం దృష్టిలో ఉంచుకుని చందనపల్లి డంపింగ్ యార్డ్‌ను మరో చోటికి తరలించాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. జనావాసాలకు దూరంగా, గ్రామాలు లేని ప్రాంతంలో 100 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని, అవసరమైతే కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకునైనా ఆధునిక డంపింగ్ యార్డ్ నిర్మించాలని కలెక్టర్‌కు సూచించారు. జిల్లాలో ఎలాంటి అంతరాయం లేకుండా 14 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసరావు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు హఫీజ్ ఖాన్, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>