కలం, సింగరేణి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ అందించి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కన్న కలలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ (MLA Ramdas naik) అన్నారు. శుక్రవారం కారేపల్లి జూనియర్ కళాశాల మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ముఖ్యమంత్రి, జిల్లా మంత్రుల సహకారంతో వైరా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాందాస్ తెలిపారు. ఇప్పటికే వివిధ నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఏ ఒక్కరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎల్పీవో, సీడీపీవో, ఎంపీడీవో, తహసీల్దార్, ఏపీఎం, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

