పేదవారి పక్షపాతిగా ఇందిరమ్మ రాజ్యం: పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం పేదవాని పక్షపాతి అని, పేదవారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి ఆయన నూతన ‘చేయూత’ పింఛను మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.

​ఈ సందర్భంగా ప్రజలకు నాగుల చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తూ పేదవాడి పక్షపాతిగా పరిపాలిస్తోందని అన్నారు. ఇటీవలి దీపావళి పండుగ నాడు రాష్ట్రవ్యాప్తంగా 2,21,500 కుటుంబాలు తమ నూతన ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాలు చేసి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.

మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షలు, హైదరాబాద్‌లో లక్ష ఇళ్లతో కలిపి మొత్తం 8 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 40 వేల కోట్లు వెచ్చిస్తోందని వివరించారు. అర్హులైన ప్రతి పేదవాడికి కులం, మతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా—పింక్ షర్ట్ వేసుకుని వచ్చినా సరే పేదవాడైతే చాలు—ఇందిరమ్మ ఇల్లు అందించి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు.

​కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో గడిచిన 33 నెలల్లో డ్వాక్రా మహిళలకు రూ. 73 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించినట్లు మంత్రి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా తెలంగాణలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. గత తొమ్మిదిన్నరేళ్లలో ఇవ్వని విధంగా తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేసిందని, ఇంకా ఎవరైనా చేయూత పెన్షన్‌కు అర్హులు మిగిలి ఉంటే వారికి కూడా తప్పకుండా మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కె. శ్రీరామ్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, ఖమ్మం రూరల్ ఎంపీడీవో కె. రవికుమార్, తహసీల్దార్ వినయేందర్ రెడ్డితో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>