నల్గొండలో బార్ అసోసియేషన్ రక్తదాన శిబిరం

కలం, నల్గొండ: ప్రజా కవి కాళోజీ నారాయణరావు ప్రజల కష్టాలను, కన్నీళ్లను, ఆకాంక్షలను తన కవిత్వంలో ప్రతిబింబించారని తెలంగాణ జూనియర్ లేడీ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నల్గొండ జిల్లా అధ్యక్షురాలు పి.భవాని అన్నారు. కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం నల్గొండ బార్ అసోసియేషన్ (Nalgonda Bar Association) హాల్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు సతీష్ కుమార్, కార్యదర్శి బి.అశోక్ కుమార్ శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా భవాని మాట్లాడుతూ.. కాళోజీ కవిత్వం కేవలం సాహిత్యానికి మాత్రమే పరిమితం కాలేదని, అది ప్రజల్లో చైతన్యాన్ని నింపిన సామాజిక ఉద్యమమన్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని తెలిపారు. కాళోజీ ఆశయాల్లో మానవత్వానికి అత్యంత ప్రాధాన్యత ఉందని, మనిషిని మనిషిగా గౌరవించడం, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు.

రక్తదానం గొప్ప కార్యక్రమం..

రక్తదానం మరొక మనిషికి ప్రాణం పోసే గొప్ప మానవతా కార్యక్రమమని భవాని అన్నారు. ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రసవ సమయాలు, ఇతర వైద్య అవసరాల్లో రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని చెప్పారు. ఆరోగ్యపరంగా అర్హులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. న్యాయవాద వృత్తి అనేది కేవలం వృత్తిపరమైన బాధ్యత మాత్రమే కాదని, సమాజం పట్ల బాధ్యతను కూడా కలిగి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పజ్జూరి స్వామి గౌడ్, నూకల సంధ్యారాణి, బార్ అసోసియేషన్ సభ్యులు పందుల సైదులు, నాంపల్లి భాగ్య, స్వామి దాస్, న్యాయవాదులు రక్తదానం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>