కలం, నిర్మల్: జాతీయ నూతన విద్యా విధానం–2020 (National Education Policy 2020)ని తెలంగాణ రాష్ట్రంలో సమగ్రంగా, పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (TAPUS) నిర్మల్ జిల్లా అధ్యక్షుడు శశిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. విద్యా విధానం అమలుపై ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుతం అమలులో ఉన్న 10+2 విద్యా విధానాన్ని 5+3+3+4 నిర్మాణంలోకి మార్చడం, పాఠశాలల్లో తరగతుల విభజనను సవరించడం మాత్రమే నూతన విద్యా విధానం అమలు చేసినట్లు కాదన్నారు.
విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథం, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించడమే ఈ విధానం అసలు లక్ష్యమని పేర్కొన్నారు. బాల్యదశ విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు మాతృభాషలో బోధన, నాణ్యమైన విద్య, వృత్తి విద్య, ఉపాధ్యాయ శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. విధానం అమలులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వారికి అవసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాలు, బోధనా వనరులు కల్పించాలని సూచించారు.
ఉపాధ్యాయుల భాగస్వామ్యంతోనే నూతన విద్యా విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని, విధాన లక్ష్యాలు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా ప్రతి విద్యార్థికి సమానమైన, సమగ్ర, నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని తపస్ నాయకులు కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. రాజేశ్వర్, నవీన్ కుమార్, జిల్లా నాయకులు ధీరజ్ కులకర్ణి, ఆర్. రాజేశ్వర్, చంద్రప్రకాష్, దత్తురాం పటేల్ తదితరులు పాల్గొన్నారు.

