కలం, నిర్మల్: జిల్లాలో చేపడుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను ఎలాంటి తప్పులు, వివాదాలకు తావులేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రీ సర్వే పురోగతిపై (Land Resurvey Progress) సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు పూర్తయిన సర్వే వివరాలను సమీక్షించారు. రీ సర్వే పురోగతిపై రోజువారీ నివేదికలు సమర్పించాలని సూచించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సర్వే పరికరాలకు అదనంగా మరికొన్ని రోవర్లను త్వరలో సమకూర్చనున్నట్లు తెలిపారు. సర్వే పూర్తయిన అనంతరం రైతులకు భూముల వివరాలను తెలియజేయాలని, ఎలాంటి అపోహలు, వివాదాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని స్పష్టం చేశారు. సర్వే నిర్వహణతో పాటు రికార్డుల భద్రతకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
భూముల రీ సర్వే పూర్తయితే ప్రస్తుతం నెలకొన్న అనేక భూ సమస్యలకు పరిష్కారం లభించడంతో పాటు భవిష్యత్తులోనూ వివాదాలు తలెత్తకుండా ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. రీ సర్వే ప్రక్రియను తహసీల్దార్లు నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్ణీత లక్ష్యాల మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకట మాధవరావు, రాథోడ్ రమేష్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్డీవో దేవీదాస్, ఏడీ ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ విఠల్, తదితరులు పాల్గొన్నారు.

