కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల ప్రాభవం (Bhadradri Maoist Violence) తగ్గుతోంది. గతంలో మందుపాతరల మోత, హింసాత్మక ఘటనలతో భయాందోళనలకు గురైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేడు శాంతి, అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. “నక్సల్ ముక్త్ భారత్” లక్ష్యంగా శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జిల్లా పోలీసు యంత్రాంగం, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని పత్రికా సమాచార కార్యాలయం (PIB) సంయుక్తంగా మీడియా సదస్సు నిర్వహించాయి. రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ, పీఐబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఈ సమావేశంలో పాల్గొని వివరాలు వెల్లడించారు.
గతంలో మావోయిస్టుల హింస వల్ల 868 మంది సామాన్య పౌరులు, 331 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. అయితే, 2014 నుంచి 2026 వరకు పోలీసుల నిరంతర నిఘాతో పరిస్థితి పూర్తిగా మారింది. ఈ 12 ఏళ్లలో 829 మంది మావోయిస్టులు అరెస్ట్ కాగా, 27 ఎదురుకాల్పుల ఘటనల్లో 57 మంది మరణించారు. మరోవైపు ప్రభుత్వ పునరావాస విధానానికి ఆకర్షితులై 918 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు.
ప్రభుత్వం అందిస్తున్న భూమి, ఇళ్లు, ఆర్థిక సహాయంతో తాము గౌరవప్రదంగా జీవిస్తున్నామని సదస్సుకు హాజరైన మాజీ మావోయిస్టులు తెలిపారు. ప్రస్తుతం మారుమూల గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు, తాగునీటి వసతి కల్పిస్తూ.. యువతకు స్వయం ఉపాధి, విద్యార్థులకు విద్యా సామగ్రి, ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ పోలీసు యంత్రాంగం ప్రజలకు మరింత చేరువైందని అధికారులు పేర్కొన్నారు.

