డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి: పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రం నుండి మాదకద్రవ్యాల మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రజా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. డ్రగ్స్ రహిత ఆరోగ్య సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. నషా విముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన డ్రగ్స్ నిరోధ అవగాహన క్విజ్ పోటీలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ఇందుకోసం ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో సుమారు 600 మంది సభ్యులతో ప్రత్యేకంగా ‘ఈగల్ టీమ్’ను ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 వేల కేసులు నమోదు చేసి 19 వేల మందికి పైగా నిందితులను అరెస్టు చేసి కఠిన సెక్షన్లు విధించామని తెలిపారు.

సొంత మనుషులైనా జైలుకే..

గంజాయి, ఇతర మత్తు పదార్థాల కేసుల్లో ఎవరు ఫోన్లు చేసి సిఫార్సులు చేసినా ఉపేక్షించేది లేదని, చివరకు తన సొంత మనుషులైనా సరే చట్టప్రకారం జైలుకు పంపాలని పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని మంత్రి పేర్కొన్నారు. కేవలం వినియోగదారులపైనే కాకుండా, డ్రగ్స్ సరఫరా మూలాలను గుర్తించి వాటిని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

​గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ నియంత్రణపై చిత్తశుద్ధి కొరవడిందని మంత్రి విమర్శించారు. నాటి మంత్రుల ఫామ్‌హౌస్‌లలో సైతం డ్రగ్స్ పట్టుబడటం దురదృష్టకరమని, రాష్ట్రంలో డ్రగ్స్ ఉన్నాయన్న భయంతోనే అప్పటి మంత్రులు తమ పిల్లలను విదేశాల్లో చదివించుకున్నారని ఆరోపించారు. కేవలం పోలీసు, ఎక్సైజ్ శాఖల వల్లే డ్రగ్స్ నియంత్రణ పూర్తిస్థాయిలో సాధ్యం కాదని, ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

చిన్నతనంలోనే పిల్లల ప్రవర్తనను గమనించి చెడు అలవాట్ల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు కట్టడి చేయాలని, ఉపాధ్యాయులు కూడా పాఠాలతో పాటు విద్యార్థుల నడవడికపై కన్నేసి ఉంచాలని కోరారు. విద్యార్థులు ఫ్యాషన్ కోసమో, స్నేహితుల ఒత్తిడితోనో మత్తు పదార్థాల జోలికి వెళ్లి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి చదువుపైనే దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి హితవు పలికారు. ​

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ అదనపు కమిషనర్ కిషన్, డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి, జిల్లా సూపరింటెండెంట్ డి. జానయ్య, ఏదులాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ ఛైర్మన్ తమ్మినేని నవీన్, మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>