కలం, నేషనల్ డెస్క్ : వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రబోధకుడు డాక్టర్ జాకిర్ నాయక్‌కు (Zakir Naik) చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (Islamic Research Foundation)పై కేంద్ర ప్రభుత్వం మరో ఐదేళ్ల పాటు నిషేధాన్ని పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)-1967 కింద ఐఆర్ఎఫ్ను చట్టవిరుద్ధ సంస్థగా గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
దేశ భద్రత, సార్వభౌమాధికారం, మత సామరస్యానికి ముప్పు కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సంస్థపై ఆరోపణలు ఉన్నాయని హోం శాఖ వెల్లడించింది. ఐఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు జాకిర్ నాయక్ తన ప్రసంగాల ద్వారా వివిధ మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కేంద్రం పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు యువతను తీవ్రవాద కార్యకలాపాల వైపు ఆకర్షించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
అంతర్జాతీయ శాటిలైట్ టెలివిజన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికల ద్వారా జాకిర్ నాయక్ తన ప్రసంగాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని కేంద్రం ఆరోపించింది. ఈ ప్రసంగాలు దేశంలో మత సామరస్యానికి విఘాతం కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఐఆర్ఎఫ్పై తొలిసారిగా 2021 నవంబర్ 15న కేంద్రం నిషేధం విధించింది.
అయితే ఆ ఆంక్షలు 2026 నవంబర్ 14 వరకు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలోనే నిషేధం పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిషేధం కొనసాగించకపోతే సంస్థ కార్యకలాపాలు తిరిగి విస్తరించే ప్రమాదం ఉందని హోం శాఖ హెచ్చరించింది. పరారీలో ఉన్న కార్యకర్తలను సమీకరించడం, దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేయడం, మిలిటెన్సీని ప్రోత్సహించడం వంటి చర్యలకు అవకాశం ఉందని పేర్కొంది. దేశ సమగ్రత, భద్రతను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

