కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాలో గోవుల అక్రమ రవాణా (Khammam Cattle Smuggling)కు పాల్పడతున్న ముఠాపై టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 33 గోవులు, దూడలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం రూరల్ మండలం అరేంపుల వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో ఈ అక్రమ రవాణా గుట్టురట్టయినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు.
శుక్రవారం ఖమ్మం టాస్క్ఫోర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. అరేంపుల ప్రాంతంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. అటుగా అనుమానాస్పదంగా వస్తున్న ఒక డీసీఎం వాహనాన్ని ఆపి తనిఖీ చేశారన్నారు. వాహనంలో నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా 33 గోవులు, దూడలను కుక్కి తరలిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారని, 33 గోవులతో పాటు రవాణాకు ఉపయోగించిన డీసీఎం వాహనాన్ని సీజ్ చేశారని తెలిపారు.
పట్టుబడిన నలుగురు నిందితులను తదుపరి విచారణ నిమిత్తం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఏసీపీ పేర్కొన్నారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఏసీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు.

