కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మీర్‌పేట్ (Meerpet)లో దారుణ హత్యకు గురైన అనిత కేసులో (35) మిస్టరీ వీడింది. రాజ్ కుమార్ అనే వ్యక్తి ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు. షేర్ మార్కెట్‌లో రూ.4 కోట్లు నష్టపోయిన రాజ్ కుమార్.. అనిత ఇంటిపై కన్నేశాడు. ఆమె వద్ద ఉన్న బంగారం దొంగలించి అమ్మేస్తే.. కొంత అప్పు తీర్చుకోవచ్చని కుట్ర చేశాడు. ప్రణాళిక ప్రకారం, బుధవారం ఆమె ఇంటికి వెళ్లిన నిందితుడు అనిత కాళ్లు, చేతులు కట్టేసి ఐరన్ బాక్స్‌తో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు పుస్తెలతాడు, గాజులు చోరీ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
స్కూల్ నుంచి ఇంటికొచ్చిన పిల్లలు రక్తపు మడుగులో తన తల్లి మృతదేహం కనిపించడంతో భయపడి తండ్రికి ఫోన్ చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మరణించారు. సీసీ టీవీ కెమెరాలు, క్లూస్ టీం దర్యాప్తులో రాజ్ కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి నిందితుడి నుంచి 9 తులాల బంగారం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.

