పాక్‌పై ప్రతీకారానికి యువ భారత్ సై.. ఫైనల్లోకి గ్రాండ్ ఎంట్రీ!

కలం, స్పోర్ట్స్ : అండర్-19 ఆసియా కప్‌లో భారత యువ జట్టు ఫైనల్‌కు (Asia Cup Final) దూసుకెళ్లింది. గురువారం మస్కట్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో టైటిల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. గత ఏడాది 2025 ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన 191 పరుగుల భారీ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు భారత్‌కు దక్కింది. అలాగే ప్రస్తుత టోర్నీ గ్రూప్ దశలోనూ పాక్ చేతిలో భారత్ ఓడిపోయింది.

మరో సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి పాకిస్థాన్ ఫైనల్ చేరింది. అఫ్గానిస్థాన్ నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 36.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని 90 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి తోడుగా ఆర్యవీర్ సెహ్వాగ్ (51), వీకే వినీత్ (57 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు.

మ్యాచ్ అనంతరం కెప్టెన్ లక్ష్య రాయ్‌చందాని మాట్లాడుతూ, ఫైనల్లో పాకిస్థాన్‌తో మంచి పోరు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. సెంచరీ చేజారినందుకు కాస్త నిరాశ ఉన్నప్పటికీ, జట్టు గెలవడమే తనకు ముఖ్యమని తెలిపాడు. టాస్ ఓడిపోవడం కూడా తమకు కలిసొచ్చిందని, ముందుగా వేసుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేశామని చెప్పాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు మనల్ చౌహాన్, యశ్‌వర్ధన్ చౌహాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి అఫ్గాన్ బ్యాటర్లను కట్టడి చేశారని కెప్టెన్ ప్రశంసించాడు.

జూనియర్ ఆసియా కప్ చరిత్రలో భారత్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఛాంపియన్‌గా నిలిచి అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ చెరో రెండు సార్లు టైటిల్ గెలుచుకున్నాయి. 2024లో బంగ్లాదేశ్ చేతిలో, 2025లో పాకిస్థాన్ చేతిలో ఫైనల్లో ఓడిన భారత్, ఈసారి కప్పు గెలిచి సత్తా చాటాలని చూస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>