విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, నిర్మల్: ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను (Education Standards) మెరుగుపరిచే లక్ష్యంతో ఉపాధ్యాయులు అంకితభావంతో బోధన సాగించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖకు సంబంధించిన అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులందరూ ప్రతిరోజూ పాఠశాలలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, తరచూ గైర్హాజరవుతున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని తిరిగి పాఠశాలలకు వచ్చేలా చూడాలన్నారు. నిర్ణీత సమయంలో సిలబస్ పూర్తి చేయడంతో పాటు, విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు పరీక్షలు నిర్వహించాలని, చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక శ్రద్ధతో బోధించాలని సూచించారు. ఉపాధ్యాయులందరూ విధులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని స్పష్టం చేశారు.

అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం, సురక్షిత తాగునీరు అందించడంతో పాటు, పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, సంక్షేమ శాఖల అధికారులు దయానంద్, నిహారిక, శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>