కలం, వెబ్ డెస్క్ : కార్తీక మాసం (Karthika Masam) వచ్చిందంటే శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తుంటారు. ఈ పవిత్ర మాసంలో ఇంట్లోనే సులభంగా, ఎంతో రుచికరంగా అన్నవరం ప్రసాదం తరహాలో గోధుమ రవ్వ హల్వా (Wheat Rava Halwa) తయారు చేసుకోవచ్చు. మరి ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ముందుగా ఒక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. అందులో జీడిపప్పు, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వ వేసి మీడియం మంటపై సుమారు 7 నుంచి 8 నిమిషాల పాటు వేయించాలి. రవ్వ మాడిపోకుండా నిరంతరం కలుపుతూ వేయించడం వల్ల మంచి సువాసన వస్తుంది.
తర్వాత ముందుగా వేడి చేసుకున్న నీటిని కొద్దికొద్దిగా రవ్వలో పోస్తూ కలపాలి. రవ్వ పూర్తిగా ఉడికే వరకు సుమారు 4 నుంచి 5 నిమిషాలు మీడియం మంటపై ఉంచాలి. నీరంతా ఇంకి రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత, అదే కొలతతో ఒకటిన్నర కప్పు బెల్లం తురుము వేసి బాగా కలపాలి. బెల్లం పూర్తిగా కరిగి హల్వాకు చక్కటి రంగు వచ్చే వరకు ఉడికించాలి.
అనంతరం మంటను తగ్గించి మూత పెట్టి మరో 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాలి. చివరగా వేయించిన డ్రై ఫ్రూట్స్, అర టీస్పూన్ యాలకుల పొడి, శనగపప్పు పరిమాణంలో పచ్చ కర్పూరం వేసి బాగా కలపాలి. అంతే నోరూరించే అన్నవరం ప్రసాదం స్టైల్ గోధుమ రవ్వ హల్వా సిద్ధం. కార్తీక మాసంలో ఈ రుచికరమైన హల్వాను ఇంట్లోనే తయారు చేసి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు.

