కలం, ఖమ్మం బ్యూరో: ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఖమ్మం జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ (Chandan Kumar) హెచ్చరించారు. పేదలకు పంపిణీ చేయాల్సిన సన్న బియ్యాన్ని అక్రమంగా అమ్ముకున్న రేషన్ డీలర్‌పై 6ఏ కేసుతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సాధారణ తనిఖీలలో భాగంగా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గరిడేపల్లి గ్రామంలోని చౌక ధరల దుకాణం (Ration Shop) నెం. 2223009 ను డీఎస్‌వో చందన్ కుమార్ తన సిబ్బందితో కలిసి గురువారం ఆకస్మికంగా తనిఖీ (Inspection) చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా దుకాణంలోని స్టాక్ రికార్డులను, భౌతికంగా ఉన్న నిల్వలతో క్షుణ్ణంగా సరిపోల్చి చూశారు.
గత మూడు నెలల సన్న బియ్యం స్టాక్‌కు సంబంధించి రికార్డుల ప్రకారం ఉండవలసిన నిల్వలను పరిశీలించగా, ఏకంగా 76.76 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిరుపేదలకు అందవలసిన సన్న బియ్యాన్ని పక్కదారి పట్టించి అక్రమంగా అమ్ముకున్నట్లు నిర్ధారణ కావడంతో డీలర్‌పై శాఖాపరమైన క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారులకు అందాల్సిన సరుకులు సక్రమంగా, పారదర్శకంగా పంపిణీ అయ్యేలా జిల్లా వ్యాప్తంగా తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని, అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని డీఎస్‌వో హెచ్చరించారు.

