కలం, నిర్మల్: యువతలో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించనున్న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ (Viksit Bharat Youth Parliament) కార్యక్రమానికి బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి (MLA Alleti Maheshwar Reddy) ఆహ్వానం అందింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ నిర్మల్ జిల్లా శాఖ నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పోటీలకు హాజరుకావాలని జిల్లా యువజన శాఖ అధికారి రమేష్ గురువారం ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందజేశారు.
శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో 18 నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువతీ యువకులు పాల్గొని ‘నషా ముక్త యువ వికసిత్ భారత్’ అంశంపై మూడు నిమిషాల పాటు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కానున్నారు. యువతలో సామాజిక చైతన్యం, నాయకత్వ పటిమను పెంపొందించి దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

