కలం, వెబ్ డెస్క్: ఉమ్మడి ఏపీలో మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (Shatrucherla Vijayarama Raju) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన 78 ఏళ్ల వయస్సులో విశాఖలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా సేవలందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో అటవీ శాఖ మంత్రిగా, రోశయ్య కేబినెట్‌లో రవాణా మంత్రిగా పనిచేశారు. 1948 ఆగస్ట్ 4న పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగి గ్రామంలో జన్మించిన శత్రుచర్ల 1978లో నాగూరు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో చేరి..
తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన శత్రుచర్ల వరుసగా గెలుస్తూ వచ్చారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి పార్వతీపురం ఎంపీగా గెలిచిన ఆయన, 1991లో కూడా మరోసారి విజయం సాధించారు. తరువాత టీడీపీలో చేరి 1998లో మళ్లీ ఎంపీగా గెలిచారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శత్రుచర్ల రాష్ట్ర విభజన తరువాత పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఆయన మృతిపై వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలుపుతున్నారు.

