కలం, మహబూబ్ నగర్ బ్యూరో: విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని వృత్తి జీవితంలోకి అడుగుపెడుతున్న సమయంలో తమ భవిష్యత్తుకు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని ఎంతో ఆలోచించి, ఆచితూచి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) సూచించారు. యువత తీసుకునే నిర్ణయాలే వారి భవిష్యత్తు జీవితానికి బలమైన పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సరోజినీ రాములమ్మ ఫార్మసీ కళాశాలలో గురువారం నిర్వహించిన 25వ గ్రాడ్యుయేషన్ వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై.. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థి దశలో కళాశాల అందించిన క్రమశిక్షణ, విజ్ఞానం, నైపుణ్యాలను జీవితంలో ఆచరణలో పెట్టాలని సూచించారు. కళాశాల వాతావరణం నుంచి బయటకు వచ్చి వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వ్యక్తుల సామర్థ్యం, పనితీరు, ఫలితాలే వారి ప్రతిభకు కొలమానాలుగా నిలుస్తాయని తెలిపారు. కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పట్టినా, ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణతో లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.
వచ్చే పదేళ్లు జీవితానికి కీలకం:
ప్రస్తుతం పట్టాలు అందుకుంటున్న విద్యార్థులు 23 నుంచి 26 ఏళ్ల వయస్సులో ఉన్నారని, ఈ దశలో తీసుకునే నిర్ణయాలు వారి రాబోయే జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా వచ్చే పదేళ్లు వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అత్యంత కీలకమని అన్నారు. ఇతరుల ఒత్తిడికి, తాత్కాలిక భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని హితవు పలికారు. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు తల్లిదండ్రులు, గురువులు, శ్రేయోభిలాషుల సలహాలు తీసుకుని, సరైన అవగాహనతో ముందుకు సాగాలని సూచించారు. చెడు అలవాట్లకు, చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ లక్ష్యసాధనపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
సరోజినీ రాములమ్మ ఫార్మసీ కళాశాలలో విద్యనభ్యసించిన పలువురు పూర్వ విద్యార్థులు నేడు దేశ, విదేశాల్లోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో కొనసాగుతుండటం గర్వకారణమని కలెక్టర్ అభినందించారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం పట్టాలు అందుకున్న విద్యార్థులు కూడా తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తాము చదువుకున్న కళాశాలకు, మహబూబ్నగర్ జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
అనంతరం బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఫార్మ్ – డి పూర్తిచేసుకున్న 90 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. మంగీలాల్, కార్యదర్శి పద్మలత, ఛైర్మన్ డాక్టర్ పి. బాలరాజ్, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

