కలం, వెబ్ డెస్క్ : క్యాబ్, ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసేందుకు గ్రీన్ SM (Green SM)అనే సంస్థ కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. గతంలో 2016లో జియో సంస్థ ఉచిత డేటా, కాల్స్ ఆఫర్లతో రంగప్రవేశం చేసి ఎయిర్సెల్, టాటా డొకోమో, రిలయన్స్ టెలికమ్యూనికేషన్స్ వంటి సంస్థలు కనుమరుగయ్యేలా చేసిందని, వొడాఫోన్, ఐడియా విలీనమయ్యే పరిస్థితి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాత కోట్లాది మంది వినియోగదారులు చేరాక జియో క్రమంగా ఛార్జీలను పెంచుతూ పోయిందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
ప్రస్తుతం గ్రీన్ SM కంపెనీ కూడా సరిగ్గా ఇదే వ్యూహాన్ని అనుసరించబోతోందని ఆయన విమర్శించారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లు తమ సొంత పనులను వదిలేసి తమతో కలవాలని ఆ సంస్థ సంకేతాలు ఇస్తోందని, మొదట వారానికి రూ.8000 ఇస్తామని ఆశ చూపి, ఆ తర్వాత దాన్ని రూ.1000కి తగ్గించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేవలం తమ సంస్థ ప్రచారం కోసం డ్రైవర్ల పొట్ట కొట్టాలని చూస్తోందని, ఇదంతా తెలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ కంపెనీకి అనుమతులు ఇచ్చారని ఆయన మండిపడ్డారు.

