కలం, నేషనల్ డెస్క్ : ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) , ఆయన కుమార్తె హర్షితకు హత్య బెదిరింపులు (Death Threat) రావడం కలకలం రేపింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) పేరుతో గుర్తుతెలియని వ్యక్తి రూ.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. డబ్బులు చెల్లించకపోతే కేజ్రీవాల్‌తో పాటు ఆయన కుమార్తెను హతమారుస్తామని హెచ్చరించినట్లు సమాచారం.
ఢిల్లీ తిలక్‌నగర్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్‌కు నవంబర్ 6న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్ ద్వారా బెదిరింపు సందేశాలు పంపినట్లు ఆయన మొహాలీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినని చెప్పుకున్న వ్యక్తి, కేజ్రీవాల్‌కు రూ.7 కోట్లు చెల్లించాలని హెచ్చరించినట్లు వెల్లడించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కేజ్రీవాల్, ఆయన కుటుంబ సభ్యులకు తగిన భద్రత కల్పించాలని ఎమ్మెల్యే పోలీసులను కోరారు. ఫిర్యాదు ఆధారంగా మొహాలీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎమ్మెల్యే కాల్ రికార్డులు, నిందితుడి ఫోన్ లోకేషన్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

