కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. వివిధ కోర్టు కేసుల కారణంగా పెండింగ్ లో ఉన్న పురపాలక సంఘాల ఎన్నికల (AP Municipal Elections) నిర్వహణకు తేదీలు ప్రకటించింది. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు.. పలు మున్సిపాలీటీలకు పోలింగ్ నిర్వహణ తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది.
ఈ నెల 14వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పునేఠా వెల్లడించారు. 16 వరకు నామినేషన్ల గడువు, 17 న స్క్రూటిని ప్రక్రియ జరుగుతుందని.. 18వ తేదీన నామినేషన్ల విత్ డ్రా ఉంటుందని తెలిపారు. 26న మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలతో పాటు 19 మున్సిపాలిటీలకు కూడా పోలింగ్ జరగనుంది. 30 వ తేదీన ఫలితాల లెక్కింపు ఉంటుందని ఎస్ఈసీ పునేఠా వివరించారు.
కాగా, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రేపు (శుక్రవారం) నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 26న సర్పంచ్ ఎన్నికల తొలివిడత పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో పోలింగ్ నిర్వహించేలా ఎస్ఈసీ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.

