30వ రోజుకు NHM ఉద్యోగుల సమ్మె.. ఎంపీ, ఎమ్మెల్యేల సంఘీభావం

కలం, నాగర్‌కర్నూల్: ఎన్‌హెచ్‌ఎమ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె (NHM Employees Strike) బుధవారం నాటికి 30వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సమ్మె శిబిరాన్ని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి (MP Mallu Ravi) సందర్శించి ఎన్‌హెచ్‌ఎమ్ ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించారు.

అనంతరం ఎంపీ మల్లు రవి సమ్మె శిబిరం నుంచే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రితో పాటు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎన్‌హెచ్‌ఎమ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి న్యాయమైన డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చి, వాటిని లిఖితపూర్వకంగా అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఓఎస్డీతో పాటు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారులతో సమన్వయం చేసుకుని సమస్యల పరిష్కారానికి చర్చిస్తామని ఎంపీకి తెలియజేశారు. అవసరమైతే ఆర్థికశాఖ మంత్రితో కూడా మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలకు అందాల్సిన వైద్యసేవల్లో సమ్మె కారణంగా కొంత జాప్యం జరుగుతున్న విషయాన్ని ఎంపీ రవి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించి, వారికి స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇచ్చి సమ్మెను విరమింపజేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎమ్ JAC నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కేవలం హామీలతో కాకుండా, క్రమబద్ధీకరణపై స్పష్టమైన నిర్ణయం, సమాన పనికి సమాన వేతనం, గ్రాస్ శాలరీపై లిఖితపూర్వక హామీ లభించే వరకు ఐక్యంగా పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సునీంద్ర, ఎన్‌హెచ్‌ఎమ్ JAC జిల్లా అధ్యక్షులు డాక్టర్ పి.ఎన్.వి. బాలకృష్ణ, జనరల్ సెక్రటరీ దామగట్ల కుమార్, ఎన్‌హెచ్‌ఎమ్ JAC నాయకులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>