కలం, నిర్మల్: తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కరువు ప్రకృతి సృష్టించింది కాదని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో ఏర్పడిన పరిస్థితులేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. కేసీఆర్‌ది రైతు సంక్షేమ పాలన అయితే.. రేవంత్‌రెడ్డిది రైతు సంక్షోభ పాలన అని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల్లో నీళ్లు అందుబాటులో ఉన్నా ఎత్తిపోసే చర్యలు చేపట్టకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు వెళ్తున్నాయని, తెలంగాణ రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయని ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ రైతు గర్జన సభలో(BRS Rythu Garjana) కేటీఆర్ సుమారు గంటసేపు ప్రసంగించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో అమలైన రైతు సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పోల్చుతూ విమర్శలు గుప్పించారు.
ప్రాజెక్టులున్నా నీళ్లివ్వరా ?
1996లో నిర్మల్‌లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించినప్పుడే కేసీఆర్‌కు తెలంగాణ నీటి ప్రయోజనాలపై ఆలోచన వచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఆ ఆలోచనల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన తర్వాత కాళేశ్వరం, ఎస్సారెస్పీ పునర్జీవం, దేవాదుల వంటి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయన్నారు. గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువులకు జీవం పోసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు.
రైతు సంక్షేమ పథకాలేవి?
కేసీఆర్ హయాంలో రైతులకు ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయం, రైతు మరణిస్తే రూ.5 లక్షల రైతుబీమా అందించామని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.12 వేల పెట్టుబడి సాయం ఏమైందని ప్రశ్నించారు. రైతుబంధు మూడు విడతలు ఎగ్గొట్టారని, రైతుబీమా అమలు నిలిచిపోయిందని ఆరోపించారు. పంటలకు బోనస్ ఇస్తామన్న హామీ బోగస్‌గా మారిందని, యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని, ప్రస్తుతం రైతులకు ఎన్ని గంటలు కరెంటు ఇస్తున్నారని ప్రశ్నించారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం..
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పింఛన్ల పెంపు, రైతులకు రుణమాఫీ, రైతుబీమా వంటి హామీల పరిస్థితి ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. విద్యార్థులకు రూ.12 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతోందన్నారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ ప్రజలను ఆదుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కరువు పరిస్థితులపై కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం..
రైతులకు జరుగుతున్న అన్యాయాలను ప్రజల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా రైతు గర్జన నిర్వహిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించాలని, రూ.2 లక్షల రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయాలని, రైతుబీమా కొనసాగించాలని, కరువు మండలాల్లో తక్షణ నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు ఇస్తామన్న అదనపు వెయ్యి రూపాయలు జమ చేయాలని, పెంచుతామన్న పింఛన్లు అమలు చేయాలని కోరారు. హామీలు అమలు చేయని ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వం మళ్లీ రావాలన్న ఆకాంక్ష ప్రజల్లో ఉందని అన్నారు.
బీజేపీ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు?
తెలంగాణలో బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని కేటీఆర్ విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. తెలంగాణలో కరువు పరిస్థితులపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి న్యాయం చేయాలంటే బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రధాని ఇంటి ముందు ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎన్నికల హామీలను ఎంతవరకు అమలు చేశారో, నియోజకవర్గానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో వివరించాలని సవాల్ విసిరారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐ పరిశ్రమను ఎందుకు పునఃప్రారంభించడం లేదని కేంద్రాన్ని నిలదీశారు.
తెలంగాణ ఉద్యమానికి నిర్మల్‌లోనే బీజం..
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి నిర్మల్ గడ్డపైనే బీజం పడిందని కేటీఆర్ గుర్తుచేశారు. 1996లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన కేసీఆర్.. తెలంగాణకు చెందిన నీటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించుకుపోతున్న తీరును చూసి ఆవేదన చెందారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితేనే ఈ ప్రాంత రైతులకు, ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతో ఉద్యమానికి బీజం పడిందన్నారు. నిర్మల్ కొయ్యబొమ్మలు, చిత్రకళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, కౌశిక్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దివాకర్ రావు, చిన్నయ్య, బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హనుమంత్ షిండే, నియోజకవర్గ ఇన్చార్జీలు రామ్ కిషన్ రెడ్డి, జాన్సన్ నాయక్, నాయకులు నల్ల వినయ్ రెడ్డి, పడకంటి రమాదేవి, లోలం శ్యాంసుందర్, రాజేందర్, రాము, గండ్రత్ రమేష్, నిజాం, మీనాజ్ తదితరులు పాల్గొన్నారు. సభకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.

