కలం, దమ్మపేట: ఆపద సమయంలో ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలను కాపాడిన దమ్మపేట (Dammapeta) ఫైర్ ఫైటర్ తోట చెన్నారావుకు అరుదైన గుర్తింపు లభించింది. సత్తుపల్లి మండలం బేతపల్లి చెరువు వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన సేవలను ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఫైర్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయంలో ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ చేతుల మీదుగా చెన్నారావు ప్రశంసాపత్రం అందుకున్నారు.
విధి నిర్వహణలో చూపిన ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తికి ఈ గుర్తింపు దక్కింది. దమ్మపేట గ్రామానికి చెందిన చెన్నారావుకు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి చేతుల మీదుగా ప్రశంసాపత్రం లభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

