కలం, ఆదిలాబాద్: భూముల రీసర్వే(Land Resurvey) ప్రక్రియను ప్రజలకు మేలు జరిగేలా, పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి రీసర్వే పురోగతిని సమీక్షించారు. నవంబర్ నెలాఖరులోగా ప్రతి జిల్లాలో తొలి విడతగా ఎంపిక చేసిన 70 గ్రామాలతో పాటు నక్షా లేని గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రతి మండలంలో ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేసి, లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
రీసర్వే సమయంలో రైతులకు ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని, అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించాలని తెలిపారు. అసైన్డ్ భూముల పట్టాలు, భూముల విస్తీర్ణం, ప్రభుత్వ భూములు, గతంలో సేకరించిన భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. రాబోయే ఏడాదిన్నరలో మూడు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రీసర్వేలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడే అధికారులపై సస్పెన్షన్‌తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, ఆర్డీవో జగదీశ్వర్ రావు, ల్యాండ్ సర్వే ఏడీ ప్రభాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

