కలం, మహబూబ్ నగర్ బ్యూరో: భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ కీలక పాత్ర పోషించారని, దేశ విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. ఆల్ మేవా సంస్థ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా తెలంగాణ చౌరస్తా, టీఎన్జీవో భవనంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి సన్మానం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సన్మాన గ్రహితలను ఘనంగా సన్మానించారు.
ఉన్నత విద్య విస్తరణకు మౌలానా ఆజాద్ విశేష కృషి: యెన్నం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్య ద్వారానే సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు. స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ విద్యారంగానికి బలమైన పునాదులు వేశారని తెలిపారు. భారతీయ సాంకేతిక విద్యా సంస్థలు (ఐఐటీలు), విశ్వవిద్యాలయాల అభివృద్ధి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏర్పాటుతో పాటు దేశంలో ఉన్నత విద్య విస్తరణకు ఆయన విశేషంగా కృషి చేశారని కొనియాడారు. లలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ వంటి సాంస్కృతిక సంస్థల అభివృద్ధిలోనూ ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు.
దేశ విభజన సమయంలో మత సామరస్యం, జాతీయ సమైక్యత కోసం ఆజాద్ చేసిన కృషి ఎంతో గొప్పదని అన్నారు. హిందూ, ముస్లిం ప్రజలు పరస్పర ప్రేమాభిమానాలతో కలిసి జీవించాలని, భారతదేశం అందరిదని ఆయన చాటిచెప్పారని గుర్తుచేశారు. మహిళలకు విద్య అందించడం ద్వారా కుటుంబాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని ఆయన దశాబ్దాల క్రితమే స్పష్టం చేశారని పేర్కొన్నారు. సింగపూర్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలు విద్య, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన రంగాలకు ప్రాధాన్యమివ్వడం ద్వారా ప్రపంచ స్థాయిలో అభివృద్ధి సాధించాయని ఎమ్మెల్యే వివరించారు.
యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు..
గతంలో విద్యా, ఉపాధి, సాగునీటి సౌకర్యాల కొరతతో మహబూబ్‌నగర్ జిల్లా వెనుకబడిందని యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లాలోని యువతకు స్థానికంగానే ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. జిల్లాలో అవసరమైన చోట జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు ఆధునిక శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
కొడంగల్ ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క ప్రాంతానికే పరిమితం కావని, మహబూబ్‌నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్ తదితర ప్రాంతాల యువతకు కూడా ప్రయోజనం చేకూర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని విస్తరించడం ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జడ్చర్ల పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటికే అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, ఇదే తరహాలో కొడంగల్ ప్రాంతంలో ప్రతిపాదించిన పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో జిల్లాకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయని అన్నారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణమే దీర్ఘకాలిక లక్ష్యం..
మహబూబ్‌నగర్ నగరంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం తమ దీర్ఘకాలిక లక్ష్యమని యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నగరంలో పలు వార్డుల్లో పనులు కొనసాగుతున్నాయని, దశలవారీగా మొత్తం నగరానికి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఈ పనులు పూర్తయితే పారిశుద్ధ్యం మెరుగుపడటంతో పాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందుతాయని పేర్కొన్నారు. నగరాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ఈద్గా అధ్యక్షులు బషీరోద్దీన్ , నైమతుల్లా, జామా మసీదు కార్యదర్శి అబ్దుల్ మజీద్, షోయబ్ అలి, ఆల్ మే వా రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి వహీద్ షాఖాద్రీ హబీబ్ రెహ్మాన్ ఆల్ మే వా రాష్ట్ర నాయకులు షేక్ ఫరీద్ ఖాజా నిజాముద్దీన్ మహమ్మద్ ఇషాక్ , యూసుఫ్ బిన్ నాసిర్, నిజాముద్దీన్, మహ్మద్ సాధిక్, కార్పొరేటర్లు తాహేర్, ఫకృ, నాయకులు మైత్రి యాదయ్య, మోయీజ్, పీర్ మహ్మద్ సాధిక్ , చంద్రమౌళి, పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

