డ్రగ్స్, ర్యాగింగ్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలి: సీపీ అంబర్ కిశోర్ ఝా

కలం, కరీంనగర్‌: గోదావరిఖనిలోని సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SIMS)లో యాంటీ ర్యాగింగ్, డ్రగ్స్, (Drugs,Ragging ) గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాపై ఉన్న చట్టపరమైన నిబంధనలు, శిక్షలపై విద్యార్థులకు (Medical Students) అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా (CP Amber Kishore Jha) మాట్లాడుతూ..వైద్య వృత్తి కేవలం ఉద్యోగం లేదా సాధారణ సేవ కాదని, ప్రాణాపాయంలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలిచే అత్యంత బాధ్యతాయుతమైన, పవిత్రమైన వృత్తి అని అన్నారు.

అందుకే ప్రజలు వైద్యులను ప్రత్యక్ష దైవాలుగా భావిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులు తమ విద్యాభ్యాస సమయంలోనే క్రమశిక్షణ, మానవతా విలువలు, సేవాభావం, పరస్పర గౌరవం వంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని సీపీ సూచించారు. వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదగడంతో పాటు మంచి వ్యక్తిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా సమాజానికి సేవలందించాలని ఆకాంక్షించారు.

సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకులుగా ఉండాలి

గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్ మాట్లాడుతూ…, సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు సహాయం చేయాలని, వారికి సరైన మార్గదర్శకత్వం అందిస్తూ ప్రోత్సహించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వేధింపులకు గురిచేయరాదని అన్నారు. కళాశాలలో ప్రతి విద్యార్థి ఎలాంటి భయం లేకుండా, సురక్షితమైన వాతావరణంలో విద్యను అభ్యసించేలా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా విద్యార్థులందరూ పరస్పరం గౌరవించుకుంటూ, ఒకరికొకరు సహకరించుకోవాలని, ముఖ్యంగా సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వారికి మార్గదర్శకులుగా నిలవాలని అన్నారు. ప్రపంచంలో దేవుడిని రెండు రూపాల్లో భావిస్తారని, పరలోకంలో ఉండే దేవుడు కనిపించకపోయినా మన కళ్లముందు ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్లు వైద్యులని ఏసీపీ పేర్కొన్నారు. దేవుడు ఎల్లప్పుడూ మంచి చేస్తూ ప్రతి ఒక్కరి మేలు కోరుకున్నట్లుగానే, వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ, మంచి మార్గంలో నడవాలని సూచించారు.

ర్యాగింగ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి

సీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ…., తెల్లని యూనిఫాంలో క్రమశిక్షణతో, హుందాగా కనిపిస్తున్న వైద్య విద్యార్థులను అభినందించారు. ఇందుకు కృషి చేస్తున్న అధ్యాపక బృందాన్ని, కళాశాల యాజమాన్యాన్ని కూడా అభినందించారు. విద్యార్థి దశలో ఏర్పడే మంచి స్నేహాలు, అనుబంధాలు జీవితాంతం గుర్తుండిపోతాయని అన్నారు. అయితే ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను అవమానించడం, భయపెట్టడం, వేధించడం లేదా మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు.

తాను బీహార్ నుంచి తమిళనాడులోని ఎన్‌ఐటీ తిరుచ్చిలో విద్యనభ్యసించేందుకు వెళ్లిన రోజులను గుర్తుచేసుకున్న సీపీ, అక్కడ యాంటీ ర్యాగింగ్ కమిటీ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో విద్యార్థులు, అధ్యాపకుల సహకారంతో ర్యాగింగ్‌కు తావులేని సురక్షితమైన విద్యా వాతావరణాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కళాశాలల్లో ర్యాగింగ్‌ను పూర్తిగా నిర్మూలించి ప్రతి విద్యార్థికి గౌరవప్రదమైన, భద్రమైన విద్యా వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది,సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులు అందరిపైనా ఉందని సీపీ అన్నారు.

డ్రగ్స్ వ్యసనం యువత భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదం

ర్యాగింగ్ కంటే డ్రగ్స్ వ్యసనం యువత భవిష్యత్తుకు మరింత ప్రమాదకరమని సీపీ అంబర్ కిశోర్ ఝా హెచ్చరించారు. ఒక్కసారి మాదకద్రవ్యాలకు బానిసైతే వాటి నుంచి బయటపడటం ఎంతో కష్టమవుతుందని, డ్రగ్స్ వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా మొత్తం కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. డీ-అడిక్షన్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితులను పరిశీలిస్తే మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థమవుతుందని పేర్కొన్నారు.డ్రగ్స్‌కు దూరంగా ఉండటమే కాకుండా, తమ స్నేహితులు, సహ విద్యార్థులు కూడా మాదకద్రవ్యాలకు బానిస కాకుండా వారిని చైతన్యపరచాలని విద్యార్థులకు సూచించారు.

గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల వినియోగం, నిల్వ, రవాణా, విక్రయాలకు సంబంధించి చట్టపరమైన చర్యలు మరియు కఠినమైన శిక్షలు ఉంటాయని తెలిపారు. డ్రగ్స్ వినియోగం వల్ల విద్యార్థుల విద్యాభ్యాసం, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, కుటుంబ సంబంధాలు, భవిష్యత్ కెరీర్ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సిబ్బంది యాంటీ డ్రగ్ కమిటీల ద్వారా హాస్టళ్లు, కళాశాల ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, సాధారణ ప్రదేశాలు తదితర ప్రాంతాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలని సీపీ సూచించారు.

డ్రగ్స్ వినియోగం లేదా సరఫరాకు ఎలాంటి అవకాశం లేకుండా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించిన వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, భవిష్యత్తు విషయంలో కళాశాల యాజమాన్యం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కేవలం కొద్దిమంది విద్యార్థుల తప్పిదాల కారణంగా మొత్తం కళాశాల పేరు, ప్రతిష్ఠ దెబ్బతినకూడదని సీపీ అన్నారు.

ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్య అందుబాటులో ఉన్న ఈ సంస్థకు తగిన విధంగా విద్యార్థులు క్రమశిక్షణ, ఉన్నత ప్రమాణాలను పాటించాలని సూచించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, అధ్యాపకులు, కళాశాలకు గర్వకారణంగా నిలిచేలా కష్టపడి చదవాలని, తమ వృత్తి నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో మంచి వైద్యులుగా ఎదిగి, పేదలు, బలహీన వర్గాలు సహా సమాజంలోని ప్రతి ఒక్కరికీ సేవలందిస్తూ మానవతా విలువలను చాటాలని సీపీ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హిమబిందు, ప్రిన్సిపాల్ దయాల్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రేఖ, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, టాస్క్‌ఫోర్స్/నార్కోటిక్ ఎస్‌ఐ రమేశ్,ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్, వన్‌టౌన్ ఎస్‌ఐలు మనోహర్, రాజశేఖర్, ప్రొఫెసర్లు, హెచ్‌ఓడీలు,వార్డెన్ డాక్టర్ ఓబులేష్, మెడికోలు,ఇతర పోలీసు అధికారులు, కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>