కలం, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట కాంగ్రెస్ (Suryapet Congress) లో ఫ్లెక్సీ ఫైట్ రచ్చకెక్కింది. ఒక్కసారిగా అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన ముఖ్య నేతలే ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మంత్రి ఉత్తమ్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఇందుకు వేదికగా నిలిచింది. ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి సొంత నియోజకవర్గమైన సూర్యాపేటలోనే వర్గపోరు నెలకొనడంతో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారితే.. కేడర్లో అయోమయం నెలకొంది.
ఫ్లెక్సీ ఫొటోలతో రగిలిన వివాదం
మంత్రి ఉత్తమ్ సమక్షంలోనే వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి ఫొటో లేకపోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. అయితే వివాదం అప్పుడే తలెత్తినది కాదని, దీని వెనుక కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు ఉందని పార్టీవర్గాల సమాచారం. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరణం తర్వాత పార్టీలో రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకవైపు దామోదర్ రెడ్డి కొడుకు, పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మరో వైపు ఆర్డీఆర్ ప్రధాన అనుచరుడు కొప్పుల వేణారెడ్డి వర్గాలుగా విడిపోయారు. ఇద్దరూ పార్టీ కోసమే పని చేస్తున్నామని చెబుతున్నా.. పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహిస్తుండడంతో కేడర్లోనూ గందరగోళం నెలకొంది.
ఓటముల భారం.. అవినీతి ఆరోపణలు
రెండు వర్గాలుగా చీలికకు ప్రధాన కారణం గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలేనని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. సూర్యాపేట నుంచి మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయిన తన తండ్రి వెంట నిలిచిన కీలక అనుచరుల వైఖరే కారణమని కొడుకు సర్వోత్తమ్ రెడ్డి నమ్ముతున్నట్లు కార్యకర్తల్లో కొన్నాళ్లుగా చర్చ జరుగుతు న్నది. తన తండ్రిని అడ్డంపెట్టుకుని ఆనాడు చక్రం తిప్పిన కొందరు నేతల అవినీతి, అక్రమాలతోనే ఓడిపోయారని, అందుకే అలాంటి వారికి తాను దూరంగా ఉండాలని సర్వోత్తమ్ నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తద్వారానే తన తండ్రితో అత్యంత సన్నిహితంగా మెలిగి, అన్నివిధాలుగా ఎదిగిన మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డిని సర్వోత్తమ్ రెడ్డి దూరం పెడుతూ వస్తున్నారనేది తెలుస్తున్నది. మరోవైపు గత పదేళ్లుగా కష్టపడి పార్టీని నమ్ముకుని బతికించామని, నిరాధార ఆరోపణలతో తమను పక్కన పెట్టాలని చూస్తే సహించేది లేదని వేణారెడ్డి వర్గీయులు వాదిస్తున్నారని తెలుస్తున్నది.
క్షేత్రస్థాయి కేడర్లో ఆందోళన
ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా, నేతలు మాత్రం రెండు వర్గాలుగా విడిపోవడం ద్వారా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని కేడర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఇదే వైఖరి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నది. మరోవైపు దామోదర్ రెడ్డికి కీలక అనుచరుడిగా ఉన్న వేణారెడ్డి.. తన రాజకీయ గురువు కొడుకు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం వచ్చినందున ఇలా చేయడం ఏంటనే వాదన కూడా వినిపిస్తున్నది. మొత్తంగా సూర్యాపేటలో కాంగ్రెస్ (Suryapet Congress) లో అంతర్గత కుమ్ములాటలను అదుపు చేసేందుకు పీసీసీ పెద్దలు ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

