సమస్యల వలయంలో ‘బాసర’ విద్యాలయం..!

కలం, నిర్మల్: గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన బాసరలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(Basara IIIT) సమస్యల సుడిగుండంలో చిక్కినది. ప్రతిభకు, నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలిచిన విద్యాలయం మౌలిక వసతుల కల్పనలో సవాళ్లను ఎదుర్కొంటున్నది. తాగు నీటి నుంచి నాణ్యత లేని భోజనం, వైద్య సేవల లోపాలు, అధ్యాపకుల కొరతతో సతమతమవుతున్నది. సమస్య వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నారే తప్ప పూర్తిస్థాయిలో పరిష్కారానికి నోచుకోవడం లేదనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన వర్సిటీలో నెలకున్న సమస్యలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, తక్షణమే పరిష్కరించాల్సిన అవసరముందని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

తొమ్మిది వేల మంది విద్యార్థులు

టెన్త్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు పొందిన గ్రామీణ విద్యార్థులకు ఇంటర్‌తో కూడిన సమీకృత బీటెక్ విద్యను అందించడమే వర్సిటీ (Basara IIIT) ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఇక్కడ సుమారు తొమ్మిది వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. చదువుతో పాటు ఆరోగ్యం, భద్రత, ఆహారం, తాగునీరు వంటి కనీస అవసరాల్లోనూ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస మౌలిక వసతులు కల్పించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉంటుందనే ఆరోపణలు ఉన్నాయి.

తాగునీటి సమస్యతో సెలవులు

ఇటీవల వర్సిటీలో తాగునీటి సమస్య తీవ్రమైంది. విద్యార్థుల అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో లేకపోవడంతో దసరా సెలవులను సైతం పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమస్యపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించి గోదావరి నుంచి నీటిని సరఫరా చేసేందుకు సుమారు రూ.8 లక్షలతో మూడు కొత్త పంపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. చెరువుల్లో నీటిని నింపి, అక్కడి నుంచి పైప్‌లైన్ ద్వారా ప్రాంగణంలోని ఇంటెక్‌వెల్‌కు తరలించి, అక్కడి నుంచి సరఫరాకు చర్యలు చేపట్టారు. అయితే వర్సిటీ ప్రాంగణంలోని బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో అవి పనిచేయడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

నాణ్యత లేని భోజనం

విద్యార్థులకు అందించే భోజనంపై కూడా తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. కాంట్రాక్టు నిర్వాహకులు నాణ్యమైన ఆహారం అందించడం లేదని, ఈగలు, పురుగులు కనిపించిన సందర్భాలున్నాయని విద్యార్థులు గతంలో ఆందోళనలు కూడా చేపట్టారు. మెనూ ప్రకారం భోజనం అందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థుల ఆరోగ్యంతో ముడిపడిన ఆహార సరఫరాలో వర్సిటీ అధికారులు నిరంతర పర్యవేక్షణ లేకపోవడంతోనే సమస్యలు పునరావృతమవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

వైద్య సేవల్లోనూ నిర్లక్ష్యం

విద్యార్థులు అనారోగ్యానికి గురైనప్పుడు సకాలంలో వైద్య సేవలు అందడం లేదనే ఆందోళనలు నెలకొన్నాయి. గతంలో అస్వస్థతకు గురైన విద్యార్థులు ఆసుపత్రుల పాలైన ఘటనలతో పాటు, ఆత్మహత్యాయత్నాలు, మృతి వంటి విషాద ఘటనలు కూడా చోటు చేసుకోగా.. వర్సిటీ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇప్పటివరకు సుమారు 100 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనే ఆందోళనకర పరిస్థితులను కూడా తల్లిదండ్రులు ప్రస్తావిస్తున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, వైద్య సేవలు, కౌన్సెలింగ్ వ్యవస్థలను బలోపేతం చేయాలని కోరుతున్నారు.

భద్రతా వైఫల్యాలతో ఆందోళన

విద్యార్థుల భద్రతపైనా గతంలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. కొందరు విద్యార్థులు వర్సిటీ నుంచి బయటకు వెళ్లిపోయిన ఘటనలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులు పోలీసులకు పట్టుబడిన సందర్భాలు కూడా వర్సిటీ భద్రతా నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతున్నది. వేలాది మంది విద్యార్థులు ఉండే వర్సిటీలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు, నిరంతర పర్యవేక్షణ కొరవడిందని తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పడిపోయిన ప్లేస్‌మెంట్లు

విద్యా ప్రమాణాలపై కూడా విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీలో రెగ్యులర్ అధ్యాపకులు, ప్రొఫెసర్ల కొరత ఉండటంతో పాటు ఎక్కువ మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వారే ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. శాశ్విత అధ్యాపకులను నియమించకపోవడం విద్యా బోధనపై తీవ్ర ప్రభావం చూపుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్యాంపస్ ప్లేస్ మెంట్ లో మంచి అవకాశాలు దక్కించుకున్న విద్యార్థులు కూడా ప్రస్తుతం వెనుకబడుతున్నారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. అకడమిక్ క్లాసులకు అవసరమైన ల్యాప్‌టాప్‌లు, ఇతర విద్యా సదుపాయాల కల్పనలోనూ జాప్యం జరుగుతుందని ఆరోపిస్తున్నారు. వర్సిటీలో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు పలుమార్లు ఆందోళనలు కూడా చేపట్టారు. పరిష్కరించాల్సిన యాజమాన్యం కేసులు పెట్టడడంతో పాటు వేధింపులకు పాల్పడుతుందని గతంలో విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. ఆయా అంశాలపై రాష్ట్ర గవర్నర్‌కు సైతం ఫిర్యాదులు చేశారు.

హామీలు కాదు.. శాశ్వత పరిష్కారాలు కావాలి

ఒకప్పుడు బాసర ట్రిపుల్ ఐటీ అంటే గ్రామీణ విద్యార్థుల ఉన్నత విద్యకు భరోసా. ఇక్కడ చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు. తమ కుటుంబాలకు అండగా నిలిచారు. అలాంటి విద్యాసంస్థ నేడు వరుస సమస్యలతో సతమతమవుతుండటం విద్యార్థులను, తల్లిదండ్రులను కలవరపెడుతోంది. సమస్యలు తలెత్తినప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం, హామీలు ఇవ్వడమే తప్ప శాశ్వత పరిష్కారాలు చూపడం లేదనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక ప్రాధాన్యంతో వర్సిటీలోని మెరుగైన వసతులు కల్పించాల్సిన అసవరం ఉంది. అందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయకుంటే వర్సిటీ తన లక్ష్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని విద్యార్థులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>