కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నం వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో వైభవంగా జరగనున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Summit Vizag) కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సాయంత్రం విశాఖ చేరుకోనున్నారు. సదస్సు ప్రారంభానికి ఒకరోజు ముందే నగరానికి చేరుకుంటున్న ఆయన, పలు అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాల్లో పాల్గొంటారు.
ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ మంత్రి గాన్ సియో హువాంగ్, ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (WIPO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ డారెన్ టాంగ్, జపాన్ రాయబారి కీచి ఓనో, యూఏఈ ఎకానమీ, టూరిజం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీలతో సీఎం ప్రత్యేకంగా సమావేశమవుతారు.
అలాగే రెన్యూ సంస్థ సీఈవో సుమంత్ సిన్హాతో పాటు అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులతో మధ్యాహ్నం చర్చలు జరుపుతారు. సాయంత్రం వేళ సీఐఐ సీఈవోలతో ప్రత్యేక భేటీ నిర్వహించి, రాత్రి 8 గంటలకు అంతర్జాతీయ ప్రతినిధులకు సీఐఐ తరఫున ఇచ్చే ప్రత్యేక విందుకు హాజరుకానున్నారు.

