కలం, కరీంనగర్: ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో ఏర్పడిన కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట రెడ్డి (Chada Venkat Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు పార్టీ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అంతకు ముందు నగరంలోని ఎంపీడీవో కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అనంతరం చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కరువు పరిస్థితుల కారణంగా వేసిన పంటలు ఎండిపోయాయని, రైతులకు భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని సీఎం రేవంత్ ఇప్పటివరకు చెప్పినా అమలుకు నోచుకోలేదన్నారు.
మూడు మండలాల్లోనే కరువు ఉందా..?
కరీంనగర్ జిల్లాలో కేవలం మూడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించారని చాడ వెంకట రెడ్డి మండిపడ్డారు. పూర్తిగా కరీంనగర్ జిల్లానే కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా వెంటనే నీరు అందించాలని, ఎండిపోయిన వరి పంటకు ఎకరానికి రూ.30 వేలు, పత్తి, మిర్చి పంటలకు రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.20 వేలు చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. హుజురాబాద్, కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్ ప్రాంతాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం సరికాదన్నారు. అనేక మండలాల్లో సాగునీటి ఎద్దడి, కరెంటు సక్రమంగా అందించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, బత్తుల బాబు, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, కౌన్సిల్ సభ్యులు ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, పోలోజు రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

