కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: క్రైస్తవుల మత విశ్వాసాలపై దాడులను సహించేది లేదంటూ క్రైస్తవ సంఘాలు నిరసన (Christian Protest) గళం వినిపించాయి. అరుణ జ్యోతి అనే యువతిపై లక్ష్మణ్ అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను నిరసిస్తూ మంగళవారం మహబూబ్‌నగర్‌లోని తెలంగాణ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వివిధ చర్చిలకు చెందిన పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, క్రైస్తవ మైనారిటీ నాయకులు కార్యక్రమంలో పాల్గొని బాధితురాలికి సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ ప్రతి పౌరుడి హక్కు అని, ఎవరి మత విశ్వాసాలను వారు ఆచరించే స్వేచ్ఛను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. విశ్వాసాలను వ్యక్త పరిచే సందర్భంలో దాడులకు పాల్పడటం ఆందోళనకరమని అన్నారు. అరుణ జ్యోతిపై దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో పాస్టర్స్ ఫెలోషిప్ చీఫ్ ప్యాట్రన్ రెవ. వరప్రసాద్, వైస్ ఛైర్మన్ జాకబ్, సెక్రటరీ డేవిడ్, కోశాధికారి స్టీఫెన్, క్రిస్టియన్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు దాసరి శామ్యూల్ ప్రభాకర్, క్రిస్టియన్ జేఏసీ అధ్యక్షులు ప్రసాద్, చర్చి కౌన్సిల్ సభ్యులు, పలువురు పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు

