కలం, ఆదిలాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా నుంచి ఏఎస్‌డీడీ జాబితాలో (ASDD Voters) నమోదైన వారికి తమ ఓటు హక్కును పొందేందుకు ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పించిందని అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ పార్టీల రాజకీయ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఏఎస్‌డీడీ జాబితాలో పేర్లు ఉన్నవారు మరోసారి అనెక్సర్-ఏ ఎన్యుమరేషన్ ఫారం నింపి సమర్పించడం ద్వారా ఓటరు జాబితాలో తమ పేరును పునరుద్ధరించుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. స్థానికంగా ఉండి ఇంతవరకు ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వనివారు అనెక్సర్-బి ద్వారా సమర్పించాలని అన్నారు. అలాగే నివాసం మారినవారు అనెక్సర్-సి నింపడంతో పాటు నివాస ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
అయితే ఈ అవకాశం కేవలం ఏఎస్‌డీడీ జాబితాలో ఉన్నవారికే వర్తిస్తుందని, ఈ నెల 21వ తేదీలోగా సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ విషయంపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఓటర్లకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ స్రవంతి, ఆర్డీఓ జగదీశ్వరరావు, పట్టణ తహసీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల పర్యవేక్షణ అధికారి నలందప్రియ, నాయబ్ తహసీల్దార్ మధుసూదన్, వివిధ పార్టీల రాజకీయ ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

