కలం, వరంగల్ బ్యూరో: పరకాల బీఆర్ఎస్లో అంతర్గత పోరు మరోసారి భగ్గుమంది. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మధ్య కొన్నాళ్లుగా పోరు నడుస్తుండగా.. తాజాగా ఫ్లెక్సీల వివాదంతో బట్టబయలైంది. క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పోచంపల్లి ఫొటో వేసి.. ధర్మారెడ్డి ఫొటోను వేయకపోవడం వివాదానికి దారితీసింది. దీంతో మాజీ ఎమ్మెల్యే వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి ఫ్లెక్సీలను తొలగించినట్లు ప్రచారంలో ఉంది.
పేరెత్తకుండా ఎమ్మెల్సీ పరోక్ష వ్యాఖ్యలు!
ఫ్లెక్సీల వివాదంలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ లో పోచంపల్లి వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపాయి. మాజీ ఎమ్మెల్యే పేరును నేరుగా ప్రస్తావించకుండా, ఫ్లెక్సీల చించివేత ఘటనను విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. నిర్వాహకులను అభినందిస్తూ, మరోవైపు రాజకీయ వివాదాలను ఆపాదించవదనే సంకేతాలిచ్చారు. ఇరువురి మధ్య తలెత్తిన ఫ్లెక్సీల వివాదం పరకాల రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే?
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రాజకీయ భవిష్యత్ పై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. కొన్నాళ్లుగా ఆయన రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారంతో పార్టీ మార్పుపైనా ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లోకి వెళ్లొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ లేదనే చర్చ కూడా దీనికి బలం చేకూరుస్తోంది. ఒకవేళ ధర్మారెడ్డి కాంగ్రెస్‌లో చేరితే పరకాల టికెట్ దక్కే చాన్స్ ఉందనే వాదనలూ లేకపోలేదు.
టీడీపీ నుంచి రెండు పార్టీలకు..
గతంలో ధర్మారెడ్డి టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరి పరకాల రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి కూడా టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు ధర్మారెడ్డి కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారా? అనే స్పష్టత లేదు. ఒకవేళ పార్టీ మారితే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా చాన్స్ కల్పిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
టికెట్ కోసమేనా?
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లకుపైగా సమయం ఉంది. ఇప్పటి నుంచే పరకాల బీఆర్ఎస్లో అభ్యర్థిత్వంపై చర్చ మొదలైనట్లు తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే తెలుస్తోంది. ధర్మారెడ్డికి మరోసారి చాన్స్ దక్కుతుందా? లేక పోచంపల్లి వైపు అధిష్టానం మొగ్గు చూపుతుందా? అనేది భవిష్యత్ లో తేలనుంది. అయితే.. తాజాగా ఫ్లెక్సీల్లో ఫొటోల వివాదం మాత్రం పరకాల రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరతీసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పరకాల వైపు పోచంపల్లి చూపు!
ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి సొంతూరు వరికోల్ పరకాల నియోజకవర్గ పరిధిలో ఉండడంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో పరకాల నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించినట్లుగా, ఇందులో భాగంగా సుమారు రూ.10 కోట్ల నిధులను సమీకరించి రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, కమ్యూనిటీ భవనాలు, ఇతర మౌలిక వసతుల కల్పనకు కృషి చేసినట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది. గ్రామాభివృద్ధిలో ఆయన కృషిని గుర్తిస్తూ పరకాల నుంచి పోటీ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోచంపల్లి పేరు తెరపైకి రావడం ప్రస్తుతం పార్టీలో ప్రాధాన్యం తెచ్చింది.

