కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ పథకం (NLM Scheme)లో చోటుచేసుకున్న అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బద్రినేతతో కలిసి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా అమలు చేస్తున్న ఎన్ఎల్ఎమ్ పథకం కరీంనగర్ జిల్లాలో అక్రమాలకు వేదికగా మారిందని ఆరోపించారు. జిల్లాలో సుమారు 40 గొర్రెలు, కోళ్ల పెంపకం ప్రాజెక్టుల కింద ఒక్కో ప్రాజెక్టుకు సుమారు రూ.కోటి వరకు ఆర్థిక ప్రయోజనం కల్పించినట్లు తెలిపారు. ఇందులో రూ.50 లక్షల ప్రభుత్వ సబ్సిడీ, రూ.40 లక్షల బ్యాంకు రుణం ఉన్న నేపథ్యంలో నిధుల వినియోగంపై సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపు 98 శాతం ప్రాజెక్టుల్లో నివేదికల ప్రకారం షెడ్లు నిర్మించలేదని, క్షేత్రస్థాయిలో గొర్రెలు, కోళ్లు లేకున్నా ఉన్నట్లుగా తప్పుడు బిల్లులు, ఫోటోలు చూపిస్తూ పశుసంవర్ధక శాఖ అధికారులు, బ్యాంకర్లు లబ్ధిదారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.
ఈ ప్రాజెక్టులకు రుణాలు మంజూరు చేసిన ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, కేడీసీసీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకుల అధికారుల పాత్రతో పాటు పశుసంవర్ధక శాఖ అధికారుల తనిఖీ నివేదికలు, రికార్డులపై విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర విచారణ బృందాన్ని నియమించి ప్రతి ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలించాలని, ప్రత్యేక ఆర్థిక ఆడిట్ నిర్వహించి అక్రమాలు రుజువైతే సబ్సిడీ నిధులను రికవరీ చేయాలని స్పష్టం చేశారు. బాధ్యులైన అధికారులు, వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని నిజమైన అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

