కలం, మధిర: ఖమ్మం జిల్లా మధిర (Madhira) పట్టణ ప్రజలకు మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు దూరమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మధిర ప్రధాన రహదారిపైనే సామాజిక ఆరోగ్య కేంద్రం (పాత ప్రభుత్వ ఆసుపత్రి) జనావాసాల మధ్య ఉండేది. దీంతో పట్టణ వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా అత్యంత సౌకర్యంగా ఉండేది. బీపీ, షుగర్ పరీక్షల నుంచి చిన్నపిల్లల వైద్యం సహా ఏ అనారోగ్య సమస్య వచ్చినా పేదలు ఈ ఆసుపత్రినే ఆశ్రయించేవారు.
రాత్రి వేళల్లో ఇబ్బందులు..
ఈ క్రమంలోనే జిలుగుమాడు వద్ద ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో వంద పడకల నూతన ప్రాంతీయ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. అనంతరం అందరికీ అందుబాటులో ఉన్న పాత ప్రభుత్వాసుపత్రిని మూసివేశారు. పట్టణానికి దూరంగా ఉన్న ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లాలంటే వృద్ధులకు, గర్భిణులకు, అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందికరంగా మారింది. రాత్రి వేళల్లో అంత దూరం ప్రయాణించలేక స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారు.
ప్రాంతీయ ఆసుపత్రిని అభివృద్ధి చేయడం మంచి విషయమే అయినా, దానిని సాకుగా చూపి పట్టణ నడిబొడ్డున ఉన్న పాత ఆసుపత్రిని మూసివేయడం తగదని స్థానికులు వాపోతున్నారు. పేద, మధ్యతరగతి ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెంటనే స్పందించాలని, మధిరలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిని తిరిగి తెరిచేలా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

