కలం, వనపర్తి: గ్రామ అభివృద్ధి పనులు, రక్షిత మంచినీటి పథకం నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వనపర్తి మండలం ఖాసీంనగర్ (Khasimnagar) గ్రామానికి చెందిన రేవల్లి రాములు సోమవారం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో చేపట్టిన పనులకు సంబంధించి వాస్తవంగా చేసిన పనుల కంటే అధిక మొత్తంలో బిల్లులు చూపించి నిధులు డ్రా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇటీవల రూ.1,02,854 నిధులు డ్రా చేయడంతోపాటు బస్టాండ్ సమీపంలో, తండాలో గుంతల రోడ్లకు మట్టి వేసినట్లు రికార్డుల్లో చూపించారని ఆరోపించారు. రక్షిత మంచినీటి పథకం నిధుల వినియోగంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన నిర్మాణానికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పనుల కొలతలు, బిల్లులు, చెల్లింపుల వివరాలను పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని, అవకతవకలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాములు కలెక్టర్‌ను కోరారు.

