కలం, నల్లగొండ : ‘‘నన్ను ద్వాపర యుగంలో అధర్మపరుడన్నారు. కానీ, ఈనాటి గంజాయి, డ్రగ్స్, రోడ్డు ప్రమాదాల రూపంలో పొంచి ఉన్న మహమ్మారులతో పోలిస్తే నేనేమీ రాక్షసుడిని కాదు. నా వేషం వెనుక ఉన్న ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడం కాదు.. మిమ్మల్ని నాశనం చేస్తున్న నిజమైన నరకాసురుల పట్ల అప్రమత్తం చేయడమే’’ అంటూ నరకాసురుడి వేషధారణలో (Narakasura Costume) ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రజలకు వినూత్నంగా అవగాహన కల్పించారు.
ఆదివారం దీపావళి పండుగ సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే తీవ్ర శారీరక, మానసిక, ఆర్థిక నష్టాలతో పాటు రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జడ్పీహెచ్ఎస్ గోరంట్ల పాఠశాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ (Rachakonda Prabhakar) ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నరకాసురుడి వేషధారణలో ప్రజలకు సందేశాన్ని అందించారు.
‘‘రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు భద్రతా నియమాలు పాటించకపోతే ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. కుటుంబం సర్వనాశనమవుతుంది. హెల్మెట్ ధరించడం మీ బాధ్యత కాదా? నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదాల బారిన పడకండి’’ అని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ సేవించడం ఆరోగ్యానికి అత్యంత హానికరమని, యువత వాటి జోలికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
రోడ్డు భద్రతా నియమాలను విధిగా పాటించాలని, వాహనదారులంతా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలను అనుసరించాలని కోరారు. మరుగున పడుతున్న ప్రాచీన జానపద కళలకు మళ్లీ ప్రాణం పోస్తూ, వాటి ద్వారా సామాజిక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన ముఖ్య ఉద్దేశమని ప్రభాకర్ తెలిపారు. ‘‘నేను పురాణాల్లో పేర్కొన్న నరకాసురుడిని కాదు.. డ్రగ్స్ అనే మహమ్మారిని తరిమికొట్టే సామాజిక నరకాసురుడిని’’ అని పేర్కొన్నారు. ప్రాచీన రాక్షస పాత్రను వినూత్నంగా మలచుకుని సమాజాన్ని వేధిస్తున్న ఆధునిక రుగ్మతలపై సమరం ప్రకటించిన ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్ ప్రయత్నాన్ని పౌరులు, అధికారులు విశేషంగా ప్రశంసించారు.
Also Read : కోహ్లీని చూసి కోచ్‌లే భయపడేవాళ్లు: టెన్ డోషాట్
Follow Us On: X(Twitter)

