కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ అల్దాస్ జానయ్య (VC Aldas Janaiah)కు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆయనపై అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు 12వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వీసీకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి అల్దాస్ జానయ్య హాజరవుతారా.. లేదా… అనేది ఆసక్తికరంగా మారింది.
అసలేం జరిగిందంటే..
వీసీ అల్దాస్ జానయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారని ఇదే వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న తేజశ్రీ ఆరోపించారు. అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు ఏకాంతంగా కలవాలని ఉందని వేధిస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రెండు రోజుల కిందట ఆమె మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. విషయం బయటపెట్టినందుకు తనను నిజామాబాద్ జిల్లాకు బదిలీ చేశారని పేర్కొన్నారు. దీంతో ఈ అంశం ఒక్కసారిగా సంచలనంగా మారింది. అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ చేస్తున్న ఆరోపణలపై ఇంతవరకు అల్దాస్ జానయ్య స్పందించలేదు. ఇప్పుడు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.

