నిర్మల్‌లో కదం తొక్కిన బీడీ కార్మికులు.. 26 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్!

కలం, నిర్మల్: బీడీ కార్మికులకు నెలకు 26 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా (Beedi Workers Protest) నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. శివాజీ (సంబాజీ) బీడీ యాజమాన్యం ప్రస్తుతం నెలకు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పని కల్పిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆకు, పొగాకు సరఫరా చేయకుండా బీడీలు తయారు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు.

తక్కువ పని దినాల కారణంగా తమకు నెలకు కేవలం రూ.1,500 మాత్రమే ఆదాయం వస్తోందని, దీంతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పింఛన్ తదితర సంక్షేమ సౌకర్యాలు పొందే అవకాశం కూడా కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేశారు.

బీడీ తయారీ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న తమకు ఇతర పనులు తెలియవని, పరిశ్రమలో ఉపాధి తగ్గడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. మహారాష్ట్రలో శివాజీ బీడీ యాజమాన్యం నెలకు 26 రోజుల పని కల్పిస్తున్నట్లుగానే తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన బీడీ కార్మికుల స్థానంలో కొత్త కార్మికులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, కార్మిక శాఖ అధికారి రాజలింగంకు అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>